Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తొలి టీ20కి టీమ్‌ ఇండియా రెడీ.. తుది జట్టులో ఆ ఒక్క చోటుపైనే ఉత్కంఠ!

Advertisement
  • ఓపెనర్లుగా సంజు శాంసన్‌, అభిషేక్‌ శర్మ
  • మూడో స్థానంలో ఆడనున్న ఇషాన్‌ కిషన్‌
  • తిలక్‌ వర్మకు ఫినిషర్‌ బాధ్యతలు
  • భువనేశ్వర్‌ కుమార్‌ పునరాగమనం
  • వరుణ్‌ చక్రవర్తి, ప్రిన్స్‌ యాదవ్‌ మధ్య పోటీ
Advertisement
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత్ సిద్ధమైంది. క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా ఈరోజు జరిగే తొలి మ్యాచ్‌లో తుది జట్టు ఎంపికపై ఆసక్తి నెలకొంది. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌, కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌కు కొన్ని కీలక ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా అదనపు స్పిన్నర్‌ను తీసుకోవాలా? పేసర్‌కు అవకాశం ఇవ్వాలా? అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు, వైభవ్‌ సూర్యవంశీకి ప్రస్తుతానికి తుది జట్టులో చోటు లేదని అయ్యర్‌ ఇప్పటికే స్పష్టం చేశాడు.

భారత్‌ తరఫున సంజు శాంసన్‌, అభిషేక్‌ శర్మ ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. ఈ విషయాన్ని అయ్యర్‌ బుధవారం వెల్లడించాడు. ఇషాన్‌ కిషన్‌ మూడో స్థానంలో ఆడనుండగా.. ఆ తర్వాత కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ బ్యాటింగ్‌కు రానున్నాడు. గత కొంతకాలంగా జట్టుకు అవసరమైన పాత్రల్లో రాణిస్తున్న తిలక్‌ వర్మ మరోసారి ఫినిషర్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు.

వెస్టిండీస్‌తో సిరీస్‌లో ఆకట్టుకున్న నమన్‌ ధీర్‌ ఆరో స్థానంలో కొనసాగనున్నట్లు తెలుస్తోంది. అయితే శివమ్‌ దూబెను కూడా తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. ఆల్‌రౌండర్లుగా నితీశ్‌ కుమార్‌ రెడ్డి, అక్షర్‌ పటేల్‌ బరిలోకి దిగనున్నారు.

బౌలింగ్‌ విభాగంలో భువనేశ్వర్‌ కుమార్‌ పునరాగమనం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అర్ష్‌దీప్‌ సింగ్‌తో కలిసి అతడు పేస్‌ బాధ్యతలు పంచుకునే అవకాశముంది. మిగిలిన స్థానం కోసం వరుణ్‌ చక్రవర్తి, మయాంక్‌ యాదవ్‌, ప్రిన్స్‌ యాదవ్‌ పోటీపడుతున్నారు. న్యూజిలాండ్‌ పిచ్‌లపై వేగం, బౌన్స్‌ ఎక్కువగా లభించే అవకాశం ఉండటంతో మరో పేసర్‌ను తీసుకోవాలా? స్పిన్నర్‌కు చోటివ్వాలా? అన్నది జట్టు యాజమాన్యం నిర్ణయించాల్సి ఉంది.

భారత్‌ అంచనా తుది జట్టు
సంజు శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), అభిషేక్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), తిలక్‌ వర్మ, నమన్‌ ధీర్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, అక్షర్‌ పటేల్‌, భువనేశ్వర్‌ కుమార్‌, ప్రిన్స్‌ యాదవ్‌/వరుణ్‌ చక్రవర్తి, అర్ష్‌దీప్‌ సింగ్‌.
Advertisement
Advertisement

More Telugu News